Pit Bull: తాచు పామును చంపి పిల్లలను కాపాడిన పెంపుడు శునకం.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఘటన
- ఇంటి ముందున్న గార్డెన్ లోకి దూరిన పాము
- పామును చూసి భయంతో కేకలు వేసిన పిల్లలు
- పరిగెత్తుకు వెళ్లి కాపాడిన బుల్ డాగ్
ఇంటి ముందున్న గార్డెన్ లో పిల్లలు ఆడుకుంటుంటే తాచుపాము లోపలికి దూరింది. తమవైపే వస్తున్న పామును చూసి పిల్లలు భయంతో కేకలు పెట్టడంతో పెంపుడు శునకం జెన్నీ వేగంగా స్పందించింది. తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి ఆ పాము పని పట్టింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు. పామును చూసి వారంతా భయంతో కేకలు వేశారని తెలిపారు. అది విని తమ బుల్ డాగ్ జెన్నీ, తాడు తెంపుకుని మరీ పిల్లల దగ్గరికి పరుగెత్తుకు వెళ్లిందన్నారు. పామును నోటితో బంధించి నేలకేసి కొట్టడం మొదలుపెట్టిందని చెప్పారు. కాసేపటికి పాము చనిపోయిందని, కదలికలు లేకపోవడంతో జెన్నీ దానిని వదిలిపెట్టిందని తెలిపారు. తమ ఇంటికి పక్కనే పొలాలు ఉండడంతో తరచుగా పాములు గార్డెన్ లోకి వస్తుంటాయని అన్నారు. జెన్నీ ఇప్పటి వరకు ఓ పది పాములను ఇలాగే చంపిందని పంజాబ్ సింగ్ వివరించారు.