Revanth Reddy: నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో సమీక్ష
- దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశం
- డబుల్ బెడ్రూం ఇళ్ళను లబ్ధిదారులకు అప్పగించాలని సూచన
నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు వాటిని అప్పగించాలని సూచించారు.
బీసీ కులగణన వేగంగా పూర్తి చేయాలి
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. బీసీ కులగణన ప్రక్రియపై సమగ్ర అధ్యయనం అవసరమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని బీసీ కమిషన్ను ఆదేశించారు. బీసీ కులగణను ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలన్నారు.
అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి విధివిధానాలను పరిశీలించాలని సూచించారు. బీసీ కులగణనను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎంతో కమిషన్ సభ్యులు చర్చించారు.