DRDO: సరికొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారుచేసిన డీఆర్‌డీవో... ప్రత్యేకతలు ఇవిగో!
- ఐఐటీ - ఢిల్లీతో కలిసి తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసిన డీఆర్‌డీవో
- 360 డిగ్రీల రక్షణను అందిస్తాయన్న రక్షణ శాఖ
- పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్ధాలు ఉపయోగించి తయారు చేసినట్లు వెల్లడి
డీఆర్‌డీవో సరికొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించింది. ఐఐటీ – ఢిల్లీతో కలిసి డీఆర్‌డీవో పరిశోధకులు వీటిని తయారు చేసినట్లు రక్షణ శాఖ బుధవారం తెలిపింది. ఈ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు ఏబీహెచ్ఇడీ (అడ్వాన్స్‌డ్ బాలిస్టక్ ఫర్ హైఎనర్జీ డిఫీట్) అని పేరు పెట్టారు. వీటిని ఐఐటీ ఢిల్లీలోని డీఆర్డీవో ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో అభివృద్ధి చేశారు. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని మూడు పరిశ్రమలకు బదిలీ చేసేందుకు ఈ కేంద్రం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ తెలిపింది.
ఈ బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేకతలు ఏమిటంటే..
8.2 కేజీలు, 9.5 కేజీల బరువుతో వివిధ బీఐఎస్ ప్రమాణాల మేరకు వీటిని రూపొందించారు. 360 డిగ్రీల రక్షణను అందించే ముందు, వెనుక కవచాలు ఇవి కలిగి ఉంటాయి. ఈ జాకెట్లను పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్ధాలు ఉపయోగించి తయారు చేశారు.