Brad Hogg: సచిన్ రికార్డును కోహ్లీ దాటడం కష్టమేనన్న బ్రాడ్ హాగ్.. కారణం ఏంటో కూడా చెప్పిన ఆసీస్ మాజీ ప్లేయర్
- సచిన్ పేరిట టెస్టుల్లో అత్యధిక పరుగుల (15,921) రికార్డు
- 12వేల పరుగులతో లిటిల్ మాస్టర్ రికార్డు వైపు దూసుకెళ్తున్న జో రూట్
- గత కొంతకాలంగా ఫామ్ లేమితో కోహ్లీ తంటాలు
- ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. 2013లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే సమయానికి సచిన్ చేసిన టెస్టు రన్స్ 15,921. వర్తమాన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ ప్రస్తుతం అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాటర్‌ల జాబితాలో ఉన్నారు. రూట్ 12,402 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, స్మిత్ (9,685 పరుగులు), కోహ్లీ (8,871 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ ముగ్గురూ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో టెండూల్కర్ చేసిన పరుగుల రికార్డును బద్దలు కొడతారని పలువురు నిపుణులు, మాజీ ఆటగాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇక టెస్ట్ క్రికెట్‌లో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. కానీ, స్మిత్, కోహ్లీ టెస్టు ఫార్మాట్‌లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీ వల్ల కాకపోవచ్చని హాగ్ జోస్యం చెప్పాడు.
"విరాట్ ఆ రికార్డును చేరుకుంటాడని అనుకోను. అతను తన లయను కోల్పోయాడు. అలా విరాట్ తన లయను కోల్పోయి కొన్నేళ్లు అవుతుంది. అతను రాబోయే 10 టెస్ట్ మ్యాచ్‌లలో తిరిగి గాడిలో పడకపోతే ఇక ఆ రికార్డు రేసు నుంచి తప్పుకొన్నట్లే.
ఇక జో రూట్‌కి 146 టెస్టు మ్యాచుల్లో 12,400 పరుగులు ఉన్నాయి. సచిన్ 200 టెస్ట్ మ్యాచ్‌ల్లో దాదాపు 16,000 పరుగులు చేశాడు. 12వేల పరుగులకు చేరుకున్న రూట్‌కు సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నాను.
జాగ్రత్తగా గమనిస్తే జో రూట్ కూడా సచిన్ రికార్డును దాటే ఎత్తుగడలోనే ఉన్నాడని అనిపిస్తుంది. చాలా కూల్‌గా ఆ వైపుగా అడుగులు వేస్తున్నాడు. ఈ మధ్య అతడు ఆడుతున్న ఆటతీరును గమనిస్తే ఇది అర్థమవుతుంది" అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్ వీడియోలో చెప్పాడు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టుకు ముందు అతడు ఈ కామెంట్స్ చేశాడు. ఇక చెన్నైలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 6, 17 స్కోర్లతో నిరాశపరిచిన విషయం తెలిసిందే.