Israel: లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. హిజ్బొల్లా డ్రోన్ చీఫ్ హతం
- లెబనాన్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్
- హిజ్బొల్లా అంతం చూడందే వెనక్కి తగ్గేది లేదన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
- ఇజ్రాయెల్ దాడుల్లో ఈ వారంలో లెబనాన్‌లో 700మంది మృతి
- ఇరు దేశాల సరిహద్దుల నుంచి 2 లక్షల మంది వలస
తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలంటూ అగ్ర రాజ్యాల నుంచి వస్తున్న ప్రతిపాదలను తోసిపుచ్చుతున్న ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై తగ్గేదే లేదన్నట్టుగా విరుచుకుపడుతోంది. హిజ్బొల్లా అంతమే పంతంగా మార్చుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులను ఆపేదే లేదని తేల్చి చెప్పారు. నిన్న బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బొల్లా సీనియర్ కమాండర్, డ్రోన్ చీఫ్ మొహమ్మద్ హుస్సీన్ సురౌర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించగా, నిజమేనని ఆ తర్వాత హిజ్బొల్లా అంగీకరించింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో 15 మందికి గాయాలయ్యాయని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హిజ్బొల్లా డజన్లకొద్దీ రాకెట్లను ఉత్తర ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. మొత్తం 45 క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ అడ్డుకోవడమో, లేదంటే అవి నివాస ప్రాంతాలు కాని ప్రదేశంలో పడడమో జరిగి ఉంటుందని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఈ వారంలోనే లెబనాన్‌లో 700 మంది మృతి చెందారు. ఈ ఉద్రిక్తతల నడుమ అటు లెబనాన్, ఇటు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో వేలాదిమంది స్థానభ్రంశం చెందారు. ఒక్క లెబనాన్ నుంచే 90 వేలమందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మొత్తంగా 2 లక్షల మంది స్థానభ్రంశం చెందారు.