Anam Venkataramana Reddy: వందేళ్ల క్రితమే వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుంది... అప్పటి నుంచి వాళ్లు క్రీస్తునే నమ్ముతున్నారు: ఆనం
- జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగిందన్న ఆనం
- వైఎస్ సమాధి వద్ద శిలువ ఉంటుందని వ్యాఖ్య
- తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనన్న ఆనం
వైసీపీ అధినేత జగన్ ఒక హాఫ్ టికెట్ అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందువా? లేక క్రిస్టియనా? అని ప్రశ్నించారు. వందేళ్ల క్రితం 1925లో వైఎస్ కుటుంబం క్రైస్తవ మతం తీసుకుందని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం ఏసుక్రీస్తునే నమ్ముతోందని తెలిపారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అందరూ క్రైస్తవులేనని చెప్పారు.
జగన్ పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగిందని వెంకటరమణారెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, భారతి తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే జరిగాయని చెప్పారు. వైఎస్ సమాధి వద్ద శిలువ ఉంటుందని అన్నారు. జగన్ క్రిస్టియన్ కాకపోతే అక్కడున్న శిలువను తొలగించాలని చెప్పారు. క్రైస్తవులను కూడా జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐకి ఇచ్చిన అఫిడవిట్ లో జగన్ తనను క్రిస్టియన్ గానే చెప్పుకున్నాడని తెలిపారు.
జగన్ ఏదో ఒక మతంలో మాత్రమే ఉండాలని ఆనం అన్నారు. జగన్ హిందువయితే... తల్లి, భార్య, కూతుళ్లతో కలిసి తిరుమలకు రావాలని... స్వామివారికి జగన్ తలనీలాలు సమర్పించాలని చెప్పారు. జగన్ కుటుంబమంతా దొంగలేనని అన్నారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాం వంటి గొప్ప వాళ్లు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకాలు చేశారని... నువ్వు వాళ్ల కంటే గొప్పవాడివా? అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనని అన్నారు.
ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ సుబ్బిగా నువ్వు గురుస్వామివా? అని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు వైవీ సుబ్బారెడ్డి పింక్ డైమండ్ కేసును విత్ డ్రా చేసుకోవాలనుకున్నాడని... అయితే కోర్టు అంగీకరించలేదని చెప్పారు. పొన్నవోలు కనపర్తిపాడులో పందులు మేపేవాడని... అందుకే పంది కొవ్వు ధరలు చెపుతున్నాడని ఎద్దేవా చేశారు.