Karthik Reddy: ఎవరూ భయపడవద్దు... మీ వెంట కేసీఆర్ ఉన్నారు: పటోళ్ల కార్తీక్ రెడ్డి

Karthik Reddy promises Musi river victims

  • ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని సూచన
  • బలవంతం చేస్తే హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుందని హెచ్చరిక
  • గంగానది ప్రక్షాళన కోసం రూ.40 వేల కోట్లు అయితే మూసీకి రూ.1.50 లక్షల కోట్లా? అని నిలదీత

మూసీ పరీవాహక ప్రాంతంలో ఉంటున్న వారు ఎవరూ భయపడవద్దని, మీ వెంట కేసీఆర్ ఉన్నాడని, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని ఆ పార్టీ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...  మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో ప్ర‌జ‌ల ఆమోదం తీసుకున్న త‌ర్వాతే ప్రక్షాళ‌న చేపట్టాలని సూచించారు. బ‌ల‌వంతం చేస్తే మాత్రం హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుందని హెచ్చరించారు.

మూసీ నదిపై ఆదిత్య సంస్థ నిర్మాణాలు చేపడుతుంటే వాటిని ఆపకుండా, పేదల ఇళ్లను కూల్చేందుకు మార్క్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆదిత్య సంస్థ ప్రభుత్వ పెద్దల చేతులు తడపడం వల్లే వారిని వదిలేశారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఆదిత్య సంస్థకు తమ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత అనుమతి నిరాకరించిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆదిత్య సంస్థ నిర్మాణలకు అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు.

దేశంలోనే అత్యంత పొడవు కలిగిన గంగా నది ప్రక్షాళన కోసం రూ.40 వేల కోట్లు అయితే, గండిపేట నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న మూసీ నది సుందరీకరణకు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకో చెప్పాలని నిలదీశారు. 

మూసీ నది డీపీఆర్ కోసం రూ.1,500 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని, ప్రపంచంలో ఇలాంటిది చూశామా? అని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ అనేది భారీ కుంభకోణమని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.16,000 కోట్లు అయితే ఇప్పుడు రూ.1,50,000 కోట్లకు పెరిగిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News