Nirmala Sitharaman: కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో ఎఫ్ఐఆర్
- ఎన్నికల బాండ్ల పేరుతో బెదిరించి బీజేపీకి విరాళాలు వచ్చేలా చేశారని ఆరోపణ
- పోలీసులు కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయించిన జనాధికార సంఘర్ష పరిషత్తు సభ్యుడు
- కోర్టు ఆదేశాలతో నిర్మలతోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం నిన్న బెంగళూరు తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరుతో పారిశ్రామికవేత్తలను బెదిరించి వారి నుంచి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారంటూ జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు నిరాకరించారు.
దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. నిన్న ఆయన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. నిర్మల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కోరారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. నగదు రూపంలో పార్టీలకు ఇచ్చే విరాళాలకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది.