Swarnandra@2047: స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం సూచనలు ఆహ్వానిస్తున్నాం: సీఎం చంద్రబాబు
- ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలన్న చంద్రబాబు
- ప్రతి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి
- తలసరి ఆదాయం రూ.36 లక్షలకు పెంచడమే ధ్యేయమని స్పష్టీకరణ
స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా ఆలోచనలు ఉన్నాయా... ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం మీ సూచనలు మాకు పంపించండి అని కోరారు.
సూచనలను ప్రజలు swarnandhra.ap.gov.in/Suggestions వెబ్ పోర్టలకు పంపించాలని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజలు అందించే సహకారానికి అభినందనగా ఈ-సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు.
స్వర్ణాంధ్రప్రదేశ్@2047 దిశగా ప్రయాణం ప్రారంభించామని, 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని వెల్లడించారు. ప్రతి అభిప్రాయానికి విలువనిస్తామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటామని, తద్వారా సమష్టిగా స్వర్ణాంధ్రను నిర్మిస్తామని వివరించారు.
2047 నాటికి భారత్ జీఎస్డీపీ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా రాష్ట్రం నుంచి తోడ్పాటు అందించడం, తలసరి ఆదాయం రూ.36 లక్షలకు పెంచడమే తమ ధ్యేయం అని చంద్రబాబు పేర్కొన్నారు.