BJP: జమ్ము కశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ
- అక్టోబర్ 1న తుది విడత పోలింగ్
- బీజేపీ మొదటిసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రానుందని ధీమా
- ప్రతిపక్షాల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శ
జమ్ము కశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇక్కడ అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జమ్ములో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... మొదటి రెండు విడతల అనంతరం పోలింగ్ సరళిని పరిశీలిస్తే మొదటిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అవినీతిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.
రెండు విడతల్లో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. బీజేపీ గెలుపు తథ్యంగా కనిపిస్తోందన్నారు. ప్రజల అభిమతంతో తొలిసారి జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడనుందన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే మంచి అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. జమ్ములో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇప్పుడు ప్రజలు శాంతిని కోరుకుంటున్నారన్నారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్ష తిరిగి చోటుచేసుకోరాదని, వేర్పాటువాదం, రక్తపాతానికి ఇంకెంతమాత్రం చోటులేదని ప్రజలు భావిస్తున్నారన్నారు.
సరిహద్దు ఉగ్రవాదంపై సర్జికల్ దాడులతో ప్రపంచానికి తాము స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. ఇది సరికొత్త ఇండియా అని, ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు. ఉగ్రవాదులు తెగబడితే వారెక్కడున్నా మోదీ వెతికి పట్టుకుంటారనే విషయం వారికి బాగా తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ దాడులకు ఆధారాలు చూపించాలని ఆర్మీని నిలదీస్తోందన్నారు.