Seyyed Hassan Nasrallah: తమ అధినేత హసన్ నస్రల్లా మృతిని నిర్ధారించిన హిజ్బొల్లా
- లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- హిజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మృతి
- శత్రువపై జిహాద్ కు కట్టుబడి ఉన్నామంటూ హిజ్బొల్లా ప్రకటన
లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యాడు. నస్రల్లా తమ దాడుల్లో మరణించాడని ఇజ్రాయెల్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా... తాజాగా హిజ్బొల్లా కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. శత్రువుపై జిహాద్ కు తమ నాయకత్వం కట్టుబడి ఉందని... గాజా, లెబనాన్ లకు తమ మద్దతు కొనసాగుతుందని ఈ కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఉన్న హిజ్బొల్లా ప్రధాన స్థావరంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాల దాడుల్లో ఆరుగురు మృతి చెందగా, 91 మంది గాయపడ్డారు. మృతుల్లో హసన్ నస్రల్లా ఉన్నట్టు ఇజ్రాయెల్ సర్వ సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ప్రకటించారు.
గత 32 ఏళ్లుగా నస్రల్లా హిజ్బొల్లాలో అన్నీ తానై వ్యవహరించాడని, నిర్ణయాధికారం నస్రల్లాదేనని వివరించారు. వేల సంఖ్యలో ఉగ్రవాద చర్యలతో ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల మృతికి కారకుడయ్యాడని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు సూత్రధారిగా నిలిచాడని హలేవీ తెలిపారు.