Apple iPhone: ఐఫోన్‌తోపాటు ఎయిర్‌పాడ్స్ ఇవ్వని యాపిల్.. కాకినాడలో రూ. 1.29 లక్షల జరిమానా
- 2021లో ఐర్లాండ్ యాపిల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఐఫోన్ ఆర్డర్ చేసిన పద్మరాజు
- ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ఇవ్వాల్సిన ఎయిర్‌పాడ్స్, చార్జింగ్ కేసును ఇవ్వని కంపెనీ
- పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించని యాపిల్
- తాజాగా వినియోగదారుల ఫోరంలో పద్మరాజుకు అనుకూలంగా తీర్పు
ఐఫోన్ కొనుగోలు సమయంలో ఎయిర్ పాడ్స్ ఇవ్వని యాపిల్‌కు కాకినాడలోని కన్జూమర్ ఫోరం రూ. 1,29,900 జరిమానా విధించింది. వినియోగదారు చందలాడ పద్మరాజు కథనం ప్రకారం.. 13 అక్టోబర్ 2021లో ఐర్లాండ్‌లోని యాపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ నుంచి యాపిల్ ఐఫోన్‌ను ఆమె ఆర్డర్ చేశారు. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన ఈ ఐఫోన్‌తోపాటు ఉచితంగా ఎయిర్‌పాడ్స్, రూ. 14,900 విలువైన చార్జింగ్ కేస్ ఇవ్వాల్సి ఉండగా ఐఫోన్ మాత్రమే డెలివరీ అయింది.
దీంతో కంగుతిన్న పద్మరాజు వెంటనే యాపిల్ కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పలుమార్లు మొరపెట్టుకున్నా అటునుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో విసుగెత్తిన ఆమె 15 ఫిబ్రవరి 2024న కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా, ఈ కేసులో వినియోగదారు పద్మరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
పద్మరాజుకు ఎయిర్‌పాడ్స్ డెలివరీ చేయడంతోపాటు రూ. 14,900 విలువైన చార్జింగ్ కేసు కూడా ఇవ్వాలని, లేదంటే ఆ మొత్తం నేరుగా అయినా చెల్లించాలని యాపిల్‌ను ఆదేశించింది. అంతేకాదు, ప్రమోషనల్ ఆఫర్లో చెప్పిన ప్రకారం ఎయిర్‌పాడ్స్, చార్జింగ్ కేసును డెలివరీ చేయకుండా వినియోగదారు పద్మరాజును మానసిక, శారీరక ఆందోళనకు గురిచేసినందుకు అదనంగా రూ. 10 వేలు, కేసు ఖర్చుల కోసం రూ. 5 వేలు చెల్లించాలని, తప్పుడు ప్రకటనతో వినియోగదారును తప్పుదోవ పట్టించినందుకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(సీఎంఆర్ఎఫ్)కు లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.