Lulu: చంద్రబాబుతో నాకు 18 ఏళ్లుగా సోదర అనుబంధం ఉంది: లులూ అధినేత యూసుఫ్ అలీ
- సీఎం చంద్రబాబుతో నిన్న భేటీ అయిన లులూ అధినేత
- లులూ మళ్లీ వస్తోందంటూ చంద్రబాబు హర్షం
- చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన యూసుఫ్ అలీ
ఏపీ సీఎం చంద్రబాబును లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ నిన్న అమరావతిలో కలిసిన సంగతి తెలిసిందే. లులూ మళ్లీ వస్తోందంటూ దీనిపై చంద్రబాబు ఎంతో సంతోషంతో ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలవడంపై యూసుఫ్ అలీ నేడు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
"నన్ను, అమరావతిలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న నా సోదరుడు అష్రఫ్ అలీని, నా బృందాన్ని ఎంతో సాదరంగా ఆహ్వానించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. చంద్రబాబుతో నాకు 18 ఏళ్లుగా సోదర అనుబంధం ఉంది. చంద్రబాబుతో నిన్న మేం జరిపిన చర్చలు ఎంతో ఫలప్రదం అయ్యాయి.
వైజాగ్ లో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ మాల్ లో 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది. విజయవాడ, తిరుపతిలో అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగిన హైపర్ మార్కెట్లును ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా, ఏపీ వ్యాప్తంగా ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం" అని యూసుఫ్ అలీ ట్వీట్ చేశారు.