Jammu And Kashmir: కశ్మీర్‌లో నేడు చివరి దశ పోలింగ్

jammu and kashmir assembly elections third and final phase

  • జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన చివరి దశ పోలింగ్
  • 40 స్థానాల్లో జరుగుతున్న చివరి దశ ఓటింగ్
  • 50 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 17 స్థానాల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉందని చెప్పిన సీఈసీ
  • అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు
  • కౌంటింగ్ విధానంపై జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని తెలిపిన సీఈసీ

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా, ఈరోజు (మంగళవారం) మూడో దశ (చివరి విడత) పోలింగ్ ప్రారంభమైంది. చివరి దశ పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. చివరి దశ పోలింగ్ నేపథ్యంలో నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ రెండు దశల్లో 50 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 17 స్థానాల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉందని తెలిపారు. 

అక్టోబర్ 8న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ప్రతి అభ్యర్ధికి పోల్ అయిన ఓట్లను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. కౌంటింగ్ విధానంపై జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఇక, మంగళవారం జరుగుతున్న 40 స్థానాలకు 415 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 2,060 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండగా, 20వేల మందికిపైగా పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు గానూ భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు.    
 
కాగా, ఈ దశ ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ పాకిస్థాన్ శరణార్ధులు, వాల్మీకి సమాజానికి చెందిన వారు, గూర్ఖా సామాజికవర్గానికి చెందిన వారు ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు వరకు జరగనుంది.

  • Loading...

More Telugu News