Pawan Kalyan: లడ్డూ వివాదం వేళ.. ఈ రాత్రికి తిరుమలకు పవన్ కల్యాణ్.. రెండు రోజులు కొండపైనే!
- సాయంత్రం 4 గంటలకు అలిపిరికి చేరుకోనున్న పవన్
- రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం
- అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. హిందూ మతానికి సంబంధించిన సనాతనధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. సనాతనధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు, తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతనధర్మ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెపుతున్నారు. పవన్ సూచన పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన ఈరోజు తిరుమలకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్డేరి సాయంత్రం 4 గంటలకు అలిపిరి పాదాల మంటపానికి చేరుకుని... అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి తిరుమలకు చేరుకుంటారు.
రెండు రోజుల పాటు తిరుమలలోనే పవన్ బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో తన ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. తిరుమల పర్యటనలో భాగంగా లడ్డూ కౌంటర్, అన్నప్రసాద కేంద్రం, వెంగమాంబ కాంప్లెక్స్ లను ఆయన పరిశీలిస్తారు. అక్టోబర్ 3న తిరుపతికి వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు వారాహి సభలో పాల్గొంటారు.
ఇక సినిమాల విషయానికి వస్తే... పవన్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో వారం రోజులు షూట్ చేస్తే... ఈ చిత్రం తొలి పార్ట్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ చెపుతున్నారు.