Hassan Nasrallah: హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా ఎలా చనిపోయాడో తెలిసింది!
- గత నెల 27న బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి
- నస్రల్లా దాక్కున్న బంకర్‌పై 80 టన్నుల బంకర్ బస్టర్ బాంబులు జారవిడిచిన వైనం
- విషవాయువులు నిండిపోవడంతో ఊపిరి ఆడక మరణించాడన్న ఇజ్రాయెల్ మీడియా
- నస్రలా మృతదేహంపై కనిపించని గాయలు
- ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని హిజ్బొల్లా
లెబనాన్ రాజధాని బీరుట్‌పై దాడిచేసిన ఇజ్రాయెల్ హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చడం తెలిసిందే. బంకర్లో దాక్కున్న అతడిని, కచ్చితంగా ఎక్కడున్నాడో అంచనా వేసి బంకర్ బాంబులతో అంతమొందించింది. అయితే, నస్రల్లా కచ్చితంగా ఎలా చనిపోయాడన్న విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా తాజాగా వెల్లడించింది.
సెప్టెంబర్ 27న బీరుట్‌పై ఇజ్రాయెల్‌లోని హిజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఓ సీక్రెట్ బంకర్లో దాక్కున్న నస్రల్లా... దాడి అనంతరం విడుదలైన విషవాయువులు బంకర్లోకి చొచ్చుకెళ్లిన కారణంగా ఊపిరి ఆడక మృతి చెందాడని తెలిపింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా దాక్కున్న బంకర్ బద్దలైందని, ఫలితంగా 64 ఏళ్ల ఉగ్రవాద సంస్థ చీఫ్ విషవాయువులతో ఉక్కిరిబిక్కిరై వేదన అనుభవించి మరణించాడని మీడియా పేర్కొంది. 80 టన్నుల బరువుండే బంకర్ బస్టర్ బాంబులు జారవిడవడంతో భారీ పేలుడు సంభవించిందని, ఫలితంగా బంకర్ విషవాయువులతో నిండిపోయిందని వివరించింది.
ఘటనా స్థలం నుంచి నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడాన్ని లెబనాన్ అధికారులు గుర్తించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే, హిజ్బొల్లా మాత్రం ఇప్పటి వరకు నస్రల్లా మృతికి గల కచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు.