Daggubati Purandeswari: రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు మాట్లాడి ఉంటారు: పురందేశ్వరి
- తిరుమల లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందన
- అధికారులతో సమీక్ష తర్వాతే మాట్లాడి ఉంటారని వ్యాఖ్య
- వారధి కార్యక్రమం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి అన్న పురందేశ్వరి
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే రిపోర్ట్ ఆధారంగానే... ఆ విషయాన్ని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి ఉంటారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. అధికారులతో సమీక్ష చేసి, నిర్ధారించుకున్న తర్వాతే ఆయన మాట్లాడి ఉంటారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు.
మీరు ఎందుకు అలా మాట్లాడారు? అని ముఖ్యమంత్రిని అడిగే హక్కు కోర్టులకు ఉందా అనే విషయంపై అందరూ ఆలోచన చేయాలని చెప్పారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పురందేశ్వరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివిధ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలను ఇస్తున్నారని పురందేశ్వరి చెప్పారు. భూ సమస్యలపై ఎక్కువ వినతి పత్రాలు వస్తున్నాయని... వాటిని జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నామని తెలిపారు. వారధి అనే కార్యక్రమం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తుందని చెప్పారు.