Prashant Kishor: రాహుల్ గాంధీని దేశమంతా నాయకుడిగా అంగీకరించిందని నేనైతే అనుకోవడం లేదు: ప్రశాంత్ కిశోర్
- నాయకులు అహంకారం ప్రదర్శిస్తే ప్రజలు సహించరన్న ప్రశాంత్ కిశోర్
- ఎన్నికల సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్య
- మోదీ పేరు కనిపిస్తే ఓట్లు పడతాయని బీజేపీ భావించిందన్న పీకే
లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ దేశమంతటా తిరిగితే ప్రజానీకం ఆయనను నాయకుడిగా అంగీకరించిందా? అనే విషయం పరిశీలిస్తే.. తన వరకు అలా అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పీటీఐ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాయకులు అహంకారం ప్రదర్శిస్తే ప్రజలు సహించరన్నారు. ఎన్నికల సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు ఏ ఒక్క నేతనో లక్ష్యంగా చేసుకొని చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పుంజుకోవడంపై అందరిలోనూ అనుమానాలు ఉండేవని, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సమర్థవంతంగా వ్యవహరించగలరని ఆ పార్టీకి చెందినవారు విశ్వసించారన్నారు.
కానీ ఇక్కడ మరో కోణం ఉందని, దేశమంతా ఆయనను నాయకుడిగా అంగీకరించిందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. మోదీ పేరు లేదా ఫొటో కనిపిస్తే ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తూ వచ్చిందని, కానీ అంతకుముందు రెండు పర్యాయాలతో పోలిస్తే ఈసారి ఈ ప్రభావం తగ్గిందన్నారు.
కాగా, ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీ 'జన్ సురాజ్' ను రేపు (అక్టోబరు 2)ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.