Chandrababu: 2025 నాటికి బందర్ పోర్టును పూర్తి చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
- బందరు పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు
- పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని అందిస్తామన్న సీఎం
- తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందన్న సీఎం
2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రూ. 3,669 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పోర్టు పనులు... వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. బందరు పోర్టు పనులను ఈరోజు పరిశీలించిన సీఎం... పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. పోర్టు పనులు పూర్తైతే మొదట నాలుగు బెర్త్‌లు ఏర్పాటు అవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్‌ల దాకా ఏర్పాటు చేయవచ్చునన్నారు. పోర్టు పూర్తైతే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, రాజధాని అమరావతికి కూడా ఈ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు.
కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోర్టు కోసం ఏళ్లకొద్దీ ఉద్యమాలు నడిచాయని గుర్తు చేశారు. ప్రాధాన్యతను గుర్తించి తాను పోర్టు పనులను ప్రారంభిస్తే తర్వాత వచ్చిన పాలకులు విధానాలు మార్చి నిర్లక్ష్యం చేశారన్నారు.
తాను కూడా మార్చితే విధ్వంసం చేసినట్లు అవుతుందని... పనులను యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తెస్తామని, బీపీసీఎల్ ఏర్పాటు పైనా త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. పోలీస్ ల్యాండ్ లో కట్టిన వైసీపీ కార్యాలయంపై సమాచారం సేకరించి యాక్షన్ తీసుకుంటామని సీఎం అన్నారు.