Balka Suman: జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమైంది?: తెలంగాణ పోలీసులకు బాల్క సుమన్ హెచ్చరిక
- జగన్ హయాంలో తప్పు చేసిన వారిని చంద్రబాబు ఇంటికి పంపించారన్న సుమన్
- తెలంగాణలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శ
- రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం
ఏపీలో జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంటికి పంపించారనే విషయం గుర్తుంచుకోవాలి... అంటూ తెలంగాణ పోలీసులు, అధికారులకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ హెచ్చరించారు. ఏపీలో చేసిన తప్పుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చెన్నూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. సూట్ కేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే జైలుకు పోవటం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు కదా... భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరన్నారు.
ఈడీ కేసు కొనసాగుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళతామన్నారు. వివేక్ ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు స్వామిభక్తి ఎక్కువైందని... రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని హెచ్చరించారు. ఈడీ విచారణ జరుగుతోన్న కేసును పోలీసులు ముగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీలోని తాజా పరిణామాలను తెలంగాణ పోలీసులు గమనించాలని హితవు పలికారు.