Ashok Gajapathi Raju: ఈ తమాషాలేంటో!: జగన్ వ్యాఖ్యలపై అశోక్ గజపతిరాజు స్పందన
- తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ప్రెస్ మీట్ పెట్టి కూటమి నేతలపై ధ్వజమెత్తిన జగన్
- దొంగలు నీతులు చెబుతుంటే వినడానికి కష్టంగా ఉందన్న అశోక్ గజపతి
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి కూటమి నేతలపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు. దొంగలు నీతులు చెబుతుంటే వినడానికి మాకు కష్టంగా ఉంది అని తెలిపారు. జగన్ ఇంట్లో ఒక మతం... బయట మరో మతం... ఈ తమాషాలు ఏంటో! అని వ్యాఖ్యానించారు.
జగన్ హిందూ ధర్మాలను అనుసరించే వ్యక్తి కాదని, హిందూ ఆచారాలను పాటించడని అన్నారు. హిందూ ధర్మంతో ఆడుకోవడం మంచిది కాదని అశోక్ గజపతిరాజు హితవు పలికారు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో ఎవరున్నా సరే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్లే తిరుమల ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 200కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, కానీ ఆలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. మత విశ్వాసాలను చంద్రబాబు కాపాడతారన్న నమ్మకం ఉందని అన్నారు.