Cyber Crime: పాకిస్థాన్ సైబర్ నేరగాళ్ల వేధింపులు.. గుండెపోటుతో యూపీ టీచర్ మృతి
- మీ కుమార్తె సెక్స్ రాకెట్లో చిక్కుకుందని ఉపాధ్యాయురాలికి ఫోన్
- కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. లక్ష పంపాలని డిమాండ్
- ఆ ఫోన్‌కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు గుర్తించిన కుమారుడు
- ఆందోళన పడొద్దని తల్లికి చెప్పినా అదే ఆలోచన
- స్కూలు నుంచి వస్తూ గుండెపోటుతో మృతి
పాకిస్థాన్ సైబర్ నేరగాళ్ల అరాచకానికి ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయురాలు బలైంది. వారి వేధింపులు భరించలేని ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఆగ్రాకు చెందిన మాలతీవర్మ ప్రభుత్వ బాలిక హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గత నెల 30న ఆమెకు ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. మీ కుమార్తె సెక్స్ రాకెట్లో ఇరుక్కుందని, ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పరువు ప్రతిష్ఠలు బజారున పడకూడదని భావిస్తే వెంటనే లక్ష రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారు.
ఫోన్ కాల్‌తో భయపడిపోయిన ఆమె ఫోన్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్‌ను చూస్తే పోలీసు అధికారిలా డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఫొటో ఉంది. దీంతో తనకు ఫోన్ చేసింది నిజంగానే పోలీసు అధికారి అని భావించి, విషయాన్ని తన కుమారుడికి ఫోన్ చేసి చెప్పింది. అతడు ఫోన్ నంబర్‌ను పరిశీలిస్తే అది (+92) పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని తల్లికి చెప్పి ఆందోళన పడొద్దన్నాడు. అయినప్పటికీ అదే ఆలోచనతో, ఆందోళనతో ఉన్న మాలతి స్కూలు నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త , వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎస్పీ ఓస్వాల్‌ను కూడా బురిడీ కొట్టించారు. ఆయనను డిజిటల్ అరెస్ట్ చేసిన నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సెట్ వేసి, వాదనలు వినిపించి మరీ రూ. 7 కోట్లు దండుకున్నారు.