VSHORADS: మరో అస్త్రానికి సానబెడుతున్న భారత్... అత్యంత స్వల్ప శ్రేణి మిస్సైల్ పరీక్ష విజయవంతం
- గగనతల ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ కృషి
- డీఆర్డీవో ఆధ్వర్యంలో వెరీ షార్ట్ రేంజ్ మిస్సైల్ పరీక్షలు
- గురు, శుక్రవారాల్లో పోఖ్రాన్ క్షేత్రంలో పరీక్షలు
- సంతృప్తికర ఫలితాలను ఇచ్చిన వీఎస్ హెచ్ఓఆర్ఏడీఎస్
గతంతో పోల్చితే ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతెన్నుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అందుకు ఇజ్రాయెల్ గట్టి ఉదాహరణ. ఐరన్ డోమ్ టెక్నాలజీ సాయంతో శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చివేస్తూ ఇజ్రాయెల్ ప్రపంచదేశాలను ఆశ్చర్యపరుస్తోంది.
భారత్ కూడా మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థ ఉండాలని కోరుకుటోంది. వాయు మార్గాల్లో వచ్చే ముప్పును ఎదుర్కొనే దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో అనేక అస్త్రాలకు పదునుపెడుతూ దూసుకెళుతోంది.
ఈ క్రమంలో తాజాగా ఓ అత్యంత స్వల్ప శ్రేణి మిస్సైల్ ను పరీక్షించింది. దీన్ని వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ (వీఎస్ హెచ్ఓఆర్ఏడీఎస్) గా పిలుస్తారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత వర్గాల్లో సంతోషం నెలకొంది.
ఇది అత్యంత ఆధునికమైన, నాలుగో తరం ఆయుధం అని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ క్షేత్రంలో గురు, శుక్రవారాల్లో ఈ షార్ట్ రేంజ్ మిస్సైల్ ప్రయోగాలు చేపట్టారు. అత్యంత వేగంతో కదిలే లక్ష్యాల దిశగా ఈ మిస్సైళ్లను ప్రయోగించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అనేక అంశాల్లో ఈ షార్ట్ రేంజ్ మిస్సైల్ సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చింది.
కాగా, ఈ వీఎస్ హెచ్ఓఆర్ఏడీఎస్ మిస్సైల్ తక్కువ బరువు కలిగి, ఓ వ్యక్తి మోసుకెళ్లగలిగేలా ఉంటుంది. దీన్ని దేశీయంగానే అభివృద్ధి చేశారు. ఈ మిస్సైల్ తయారీలో డీఆర్డీవో, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), డెవలప్ మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్ నర్ (డీసీపీపీ) సంస్థలు పాలుపంచుకున్నాయి.