Tilak Varma: యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మకు బంపర్ చాన్స్
- రేపటి నుంచి టీమిండియా-బంగ్లాదేశ్ టీ20 సిరీస్
- వీపు గాయంతో సిరీస్ మొత్తానికి దూరమైన శివమ్ దూబే
- దూబే స్థానంలో తిలక్ వర్మను ఎంపిక చేసిన సెలెక్టర్లు
తెలుగుతేజం, యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ (21)కు బంపర్ చాన్స్ తగిలింది. టీమిండియా-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ రేపు ప్రారంభం కానుండగా... ఆల్ రౌండర్ శివమ్ దూబే గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు. శివమ్ దూబే స్థానంలో సెలెక్టర్లు ఎడమచేతివాటం డాషింగ్ బ్యాట్స్ మన్ తిలక్ వర్మను ఎంపిక చేశారు.
వీపు నొప్పితో బాధపడుతున్న శివమ్ దూబే సిరీస్ మొత్తానికి దూరమైనట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సీనియర్ సెలెక్షన్ కమిటీ శివమ్ దూబే స్థానాన్ని తిలక్ వర్మతో భర్తీ చేయాలని నిర్ణయించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. తిలక్ వర్మ రేపు (అక్టోబరు 6) ఉదయం జట్టుతో కలుస్తాడని వివరించారు.
కాగా, ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ అక్టోబరు 12న హైదరాబాదులో జరగనుంది. తిలక్ వర్మ సొంతగడ్డపై ఏ విధంగా ఆడతాడన్నది ఆసక్తి కలిగిస్తోంది.
బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా ఇదే...
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ.