MLA Kolikapudi srinivasarao: తప్పు నాదే... ఇకపై అలా జరగనివ్వను: కొలికపూడి వివరణ
- తిరువూరు టీడీపీ వివాదంపై దృష్టి సారించిన అధిష్ఠానం
- ఎమ్మెల్యే కొలికపూడికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు
- కొలికపూడి నుంచి వివరణ తీసుకున్న పార్టీ పెద్దలు
- ఈ రోజు తిరువూరులో పార్టీ పెద్దల సమక్షంలో కార్యకర్తల సమావేశం
తిరువూరు టీడీపీలో నెలకొన్న విభేదాల పరిష్కారానికి పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు, జర్నలిస్ట్ లు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కొలికపూడిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో తిరువూరు టీడీపీ రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదంపై దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం పిలిపించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం కొలికపూడి శ్రీనివాసరావుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, సత్యనారాయణరాజు తదితరులు చర్చించారు. తిరువూరులో జరిగిన పరిణామాలపై ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే కొలికపూడి తన వల్ల జరిగిన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తన పనితీరు వల్లనే పార్టీలో సమన్వయ లోపం ఏర్పడిందని అంగీకరిస్తూ సమస్య సరి దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా తనదేనని చెప్పినట్లు సమాచారం.
ఆదివారం పార్టీ ప్రతినిధుల సమక్షంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తన వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటానని పార్టీ పెద్దలకు కొలికపూడి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొలికపూడి మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమాపణలు తెలియజేశారు. ఈరోజు పార్టీ నేతలతో నిర్వహించే సమావేశంలో కొలికపూడి చేసే విజ్ఞప్తులపై అసంతృప్తి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఆ నేతలు మెత్తబడతారా ? ఆయన నాయకత్వంలో పని చేయడానికి అంగీకరిస్తారా? అనేది తేలాలి అంటే వేచి చూడాల్సిందే.