RK Roja: పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే: రోజా
- కూతురు కనిపించట్లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫైర్
- సీఎం, డిప్యూటీ సీఎం ఏంచేస్తున్నారని నిలదీసిన మాజీ మంత్రి
- కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై చూపించాలంటూ హితవు
ఆంధ్రప్రదేశ్ లోని పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్యపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం ఏంచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధలో కొంత ప్రజల భద్రతపై పెట్టాలంటూ కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. ఈమేరకు ఇన్ స్టాలో రోజా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆదివారం రాత్రి నుంచి తమ కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని రోజా ఆరోపించారు. గాలింపు చర్యల్లో పోలీసుల అలసత్వం కారణంగా పాప చనిపోయిందని, నాలుగు రోజుల తర్వాత తన ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప మృతదేహం దొరికిందని గుర్తుచేశారు. సీఎం సొంతజిల్లాలోని నియోజకవర్గంలో ఈ దారుణం చోటుచేసుకోవడం ప్రభుత్వానికే సిగ్గుచేటని రోజా విమర్శించారు.
మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే సీఎం చంద్రబాబు హుటాహుటిన డీజీపీని హెలికాఫ్టర్ లో పంపించారని రోజా గుర్తుచేశారు. మరి ఏడేళ్ల చిన్నారి చనిపోతే డీజీపీని ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఇటీవలి నేరాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనను ప్రస్తావిస్తూ.. బాధిత యువతులకు న్యాయం చేయాల్సిందిపోయి వారినే బెదిరించి ఇళ్లకు పంపించారని హోంమంత్రిపై విమర్శలు గుప్పించారు. ముచ్చుమర్రి మైనర్ హత్యోదంతంలో నేటికీ మృతదేహం జాడ కనుక్కోలేదని చెప్పారు. సాక్షాత్తూ హోంమంత్రి ఉన్న పక్క ఊరిలో ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించినా రక్షణ దొరకలేదన్నారు. జైలు నుంచి వచ్చిన నిందితుడు ఆ కుటుంబానికి చెందిన యువతిని చంపేశాడని చెప్పారు.