Israel: గాజా యుద్ధానికి ఏడాది.. ఇజ్రాయెల్ సైనిక స్థావరం లక్ష్యంగా క్షిపణి ప్రయోగించిన హిజ్బుల్లా
- గతేడాది అక్టోబర్ 7న మొదలైన గాజా యుద్ధం
- హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలో సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సేనలు
- 41 వేల మందికి పైగా చనిపోయి ఉంటారని అంచనా
- హమాస్ అనుకూల హిజ్బుల్లా లక్ష్యంగా దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ బలగాలు
- ఇరాన్ ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన గాజా యుద్ధానికి ఏడాది పూర్తయింది. గతేడాది అక్టోబర్ 7న ఈ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నగరాల్లోకి చొరబడి దాదాపు 1,200 మంది పౌరులను పొట్టనబెట్టుకున్నారు. 250 మందికి పైగా బందీలుగా మార్చుకున్నారు. హమాస్ ముష్కరులు సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సేనలు యుద్ధాన్ని ఆరంభించాయి.
ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు కనీసం 41,000 మంది చనిపోయి ఉంటారని అంచనాగా ఉంది. గాజా స్ట్రిప్‌లో ఆదివారం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించింది. ఒక మసీదు, యుద్ధ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న ఓ పాఠశాల లక్ష్యంగా వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో కనీసం 26 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన లక్ష్యాలపై తాము కచ్చితమైన దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
కాగా హమాస్‌కు మద్దతుగా నిలుస్తున్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ స్థావరాలను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆపరేషన్లను ఇటీవలే మొదలుపెట్టింది. ఈ మేరకు ఆ దేశ బలగాలు క్షేత్రస్థాయిలో దాడులను ముమ్మరం చేశాయి. లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాల ధ్వంసం ప్రక్రియ ఆదివారం మరింత ముమ్మరం అయింది. బీరుట్లో వైమానిక దాడులు పెరిగాయి. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సేనలు జోరుగా వైమానిక దాడులు జరిపాయి. హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను తమ క్షిపణులు తాకాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బీరుట్‌లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని కూడా తమ యుద్ధ విమానాలు ఛేదించాయని తెలిపింది.
మరోవైపు ఇజ్రాయెల్‌లో మూడవ అతిపెద్ద నగరమైన హైఫాకు దక్షిణాన ఉన్న సైనిక స్థావరాన్ని తమ క్షిపణి తాకిందని హిజ్బుల్లా ప్రకటించింది. ‘ఫాడీ 1’ క్షిపణులతో దాడి చేశామని పేర్కొంది. కాగా దేశంలోని ఉత్తర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 10 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
కాగా లెబనాన్‌లో 2000 మందికి పైగా చనిపోయినట్టు అంచనాగా ఉంది. ఇక హమాస్, హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతుగా నిలుస్తుండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.