Euphoria: ఉత్కంఠ కలిగిస్తున్న గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్
- కొత్తవారితో యుఫోరియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న గుణశేఖర్
- ఇప్పటి వరకు అరవైశాతం షూటింగ్ పూర్తి
- యదార్థ సంఘటనలే ఈ కథకు ప్రేరణ అంటున్న గుణశేఖర్
భారీ చిత్రాల మేకర్‌గా పేరొందిన గుణశేఖర్ తొలిసారిగా కొత్త నటీనటులతో 'యుఫోరియా' అనే యూత్‌ఫుల్ సోషల్డ్రామాని తెరకెక్కిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రస్తుతం సమాజంలో బర్నింగ్ ఇష్యూగా వున్న డ్రగ్స్, అమ్మాయిలపై అత్యాచారాలు వంటి అంశాల చుట్టు గుణశేఖర్ ఈ కథను అల్లుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. "గుణశేఖర్ తన కెరీర్లో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశారు. ఫెయిల్యూర్ తరువాత వచ్చే విజయం కిక్కు వేరేలా వుంటుంది. నేటి ట్రెండ్‌కు తగిన కథ ఇది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది" అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ.. "అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. 90 శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను బేస్‌గా చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. సమాజంలో జరిగిన ఓ రెండు సంఘటనలు నన్ను కదిలించాయి. ఈ కథను రాయడం మొదలుపెట్టగానే ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను.
ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత్రలకు ఎవరు సూట్ అవుతారో వారినే తీసుకున్నాం. వాళ్లంతా కూడా కథకు కనెక్ట్ అయ్యారు. సినిమాటిక్‌గా కాకుండా అందరూ రియలిస్టిక్‌గా నటించారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.
ఇప్పుడున్నయూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. మొదట్లో ఈ చిత్రానికి ఉద్వేగం అనే టైటిల్ అనుకున్నాను. కానీ ఆ టైటిల్ ఎవరికి అర్థం కాదని యుఫోరియా అనే టైటిల్‌ని నిర్ణయించాం" అని వివరించారు.