Chandrababu: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
- మోదీతో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల ప్రస్తావన
- రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ సమావేశమైన చంద్రబాబు
- రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోదీతో సమావేశంలో చంద్రబాబు రాష్ట్రానికి చెందిన అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానితో సమావేశం దాదాపు గంటపాటు సాగింది.
రాష్ట్రంలో వరద నష్టం, పోలవరం ప్రాజెక్టు, డయాఫ్రం వాల్ కు నిధులు, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, తాజా రాజకీయ పరిణామాల గురించి చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించారు. వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా మరిన్ని నిధులు ఇవ్వాలని మోదీని కోరారు.
చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కూడా కలిశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పురోగతిపై చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. పోర్టుల అభివృద్ధి, అనుసంధానం తదితర అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కూడా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నితిన్ గడ్కరీని కలవనున్నారు. ఇతర కేంద్రమంత్రులు పియూష్ గోయల్, హర్ దీప్ సింగ్ పురిని కూడా చంద్రబాబు కలవనున్నారు.