Chandrababu: ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించాను: సీఎం చంద్రబాబు
- ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
- ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ
- సమావేశాల వివరాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడి
ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించానని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాజధాని నగరం అమరావతికి మద్దతు ఇస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇక, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీకి సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను ముందుకు తీసుకెళుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు.
కొత్త రైల్వే జోన్ కు డిసెంబరులో పునాది రాయి పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనుల చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి తెలిపారని చంద్రబాబు వెల్లడించారు.