Rahul Gandhi: హర్యానాలో బీజేపీ గెలుపుపై స్పందించిన రాహుల్ గాంధీ
- హర్యానా ఫలితాలపై విశ్లేషణ చేపట్టినట్లు రాహుల్ వెల్లడి
- చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్య
- ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం పోరాటం కొనసాగుతుందన్న నేత
హర్యానాలో బీజేపీ విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. హర్యానాలో ఊహించని ఫలితాలు వచ్చాయని... ఈ ఫలితాలపై విశ్లేషణ చేపట్టినట్లు చెప్పారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆ ఫిర్యాదులను విశ్లేషించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. హర్యానాలో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజాగళాన్ని వినిపిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. కూటమిని గెలిపించిన జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు రాజ్యాంగం సాధించిన విజయం అన్నారు.
హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అద్భుత విజయాన్ని సాధించింది. 90 సీట్లకు గాను 48 చోట్ల బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమైంది. నిన్న ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు రెండు పార్టీల మధ్య హోరాహోరీ కనిపించింది. ఆ తర్వాత క్రమంగా కాంగ్రెస్ వెనుకబడింది. బీజేపీ గెలిచిన పలుచోట్ల మెజార్టీ తక్కువగా ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.