Atishi: ఢిల్లీ సీఎం నివాసానికి సీల్ వేసిన అధికారులు... రిక్షాలో సామాను తరలింపు
- సీఎం నివాసానికి సీల్ వేసిన పీడబ్ల్యుడీ అధికారులు
- రిక్షాలో, ట్రక్కుల్లో సామాను తరలించినట్లుగా వీడియోలు
- సీఎం నివాసానికి సీల్‌పై బీజేపీ, ఏఏపీ మధ్య మాటల యుద్ధం
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అధికారిక నివాసానికి ఈరోజు పీడబ్ల్యుడీ అధికారులు సీల్ వేశారు. ముఖ్యమంత్రి సామగ్రిని అక్కడి నుంచి తరలించారు. ఢిల్లీలోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. మాజీ సీఎం కేజ్రీవాల్ అక్కడి నుంచి ఖాళీ చేసిన అనంతరం కొత్త సీఎం అతిషి ఆ నివాసంలోకి వచ్చారు.
అయితే ఈ రోజు అక్కడకు వచ్చిన పీడబ్ల్యుడీ అధికారులు సీఎంకు సంబంధించిన సామగ్రిని రిక్షాలో, ట్రక్కుల్లో, కారులో తరలించినట్లుగా వీడియోలు వెలుగు చూశాయి.
ఈ నివాసానికి సీల్ వేయడంపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేజ్రీవాల్ రాజీనామా చేశాక బంగ్లా తాళాలను సంబంధిత శాఖకు అప్పగించలేదని బీజేపీ ఆరోపిస్తోంది. సంబంధిత శాఖ నుంచి అప్రూవల్ లేకుండా, తాళాలు తిరిగి ఇవ్వకుండా మళ్లీ బంగ్లాలోకి కొత్త సీఎం అడుగు పెట్టారని విమర్శించింది. బంగ్లాలో రహస్యాలు ఏమి దాగున్నాయో చెప్పాలని నిలదీసింది.
అయితే, అతిషి అధికారిక నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించడం వెనుక లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం ఉందని సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో ఆరోపించింది. దేశ చరిత్రలో ఒక సీఎం నివాసాన్ని ఖాళీ చేయించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. 27 ఏళ్లుగా ఢిల్లీ సీఎం భవన్ బీజేపీకి అందని ద్రాక్షగా మిగిలిందని, ఆ పార్టీకే చెందిన బడా నేతకు ఆ బంగ్లాను కేటాయించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సిద్ధమవుతున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణలపై ఎల్జీ కార్యాలయం స్పందించలేదు.