AP Govt: అర్చకుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
- అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఏపీ ప్రభుత్వం
- ఈ మేరకు గురువారం కీలక ఉత్వర్వుల జారీ
- యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, ఇతర సేవల్లో అధికారుల పాత్ర పరిమితం
అర్చకుల విషయంలో ఏపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆలయాల్లో అర్చకులకు సర్వాధికారాలు కల్పించినట్టయింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
ఇకపై దేవదాయ కమిషనర్ సహా ఏ స్ఠాయి జిల్లా అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. దీంతో యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, ఇతర సేవల్లో అధికారుల పాత్ర పరిమితంగానే ఉండనుంది.
ఆధ్యాత్మిక విధుల విషయంలో ఏ విషయంలో అయినా సరే తుది నిర్ణయం తీసుకునే అధికారం అర్చకులకే ఉంటుంది. అవసరమైతే ఈఓలు వైదిక కమిటీలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవచ్చు. ఇక ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు వెసులుబాటు లభిస్తుంది.