Ratan Tata: రతన్ టాటా మరణం... మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం
- రతన్ టాటా మరణంపై నేడు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర
- ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడి
- అలాగే ఆయనకు 'భారతరత్న' కోసం కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయం
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసి యావత్ భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, రతన్ టాటా మరణంపై మహారాష్ట్ర సర్కార్ నేడు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించింది.
అలాగే రతన్ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ అయిన మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
మొదట, కేబినెట్ రతన్ టాటాకు సంతాపం ప్రకటించింది. అనంతరం, దేశానికి ఆయన చేసిన సేవలకుగాను దేశ అత్యున్నత పురస్కారం అయిన 'భారతరత్న' ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.