Tom Latham: భారత పర్యటనలో కివీస్ జట్టుకు కెప్టెన్సీ వహించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా లేను: టామ్ లేథమ్
- ఇటీవల శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ ఓటమి
- కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్ సౌథీ
- కొత్త కెప్టెన్ గా టామ్ లేథమ్
- అక్టోబరు 16 నుంచి టీమిండియా, కివీస్ మధ్య 3 టెస్టుల సిరీస్
న్యూజిలాండ్ జట్టు అక్టోబరు 16 నుంచి భారత్ లో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టులు జరగనున్నాయి. ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల సిరీస్ లో ఓటమిపాలైన కివీస్ జట్టు కొత్త కెప్టెన్ తో భారత పర్యటనకు వస్తోంది.
సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, అతడి స్థానంలో టామ్ లేథమ్ ను న్యూజిలాండ్ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా నియమించారు. తన నియామకంపై టామ్ లేథమ్ స్పందించాడు.
గతంలో పలుమార్లు ఆపద్ధర్మ కెప్టెన్ గా వ్యవహరించానని, ఇప్పుడు ఫుల్ టైమ్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకుంటున్నానని తెలిపాడు. అయితే, తాను ఇప్పటికీ పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేందుకు నూటికి నూరు శాతం సిద్ధంగా లేనని అన్నాడు. సహచరుల మద్దతుతో జట్టును నడిపిస్తానని, క్రమంగా తనదైన పంథాలో ముందుకు వెళతానని లేథమ్ వివరించాడు.
అంతర్జాతీయ యవనికపై కివీస్ బ్రాండ్ క్రికెట్ ఆడి మెరుగైన ఫలితాలు రాబడతామని, అందుకు భారత్ తో సిరీస్ ద్వారా శ్రీకారం చుడతామని లేథమ్ తెలిపాడు. అయితే, భారత్ లో టెస్టు సిరీస్ ఆడడం ఏమంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు.