Phonepay: ఫోన్ పే తర్వాతే మిగతావన్నీ...!
- గణనీయంగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు
- లావాదేవీల్లో మొదటి స్థానంలో నిలిచిన ఫోన్ పే
- తర్వాతి స్థానాల్లో గుగుల్ పే, పేటీఎంలు
స్మార్ట్ ఫోన్ల వినియోగం నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. సంఖ్యాపరంగా, విలువ పరంగా కూడా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అంటే జనవరి నుంచి జూన్ వరకూ యూపీఐ పేమెంట్స్ సంఖ్య 78.97 బిలియన్లకు చేరింది. గత ఏడాది నమోదు అయిన 51.9 బిలియన్లతో పోలిస్తే 52 శాతం పెరిగింది.
గత సంవత్సరం జనవరి నెలలో యూపీఐ లావాదేవీలు 8.03 బిలియన్ డాలర్లు జరగ్గా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 13.9 బిలియన్ డాలర్లకు చేరింది. విలువ పరంగా చూసుకున్నా రూ.12.98 ట్రిలియన్ల నుంచి రూ.20.07 ట్రిలియన్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో యూపీఐ లావాదేవీల విలువ రూ.116.63 ట్రిలియన్లుగా నమోదైంది. 2023 లో నమోదు అయిన రూ.83.16 ట్రిలియన్లతో చూస్తే 40 శాతం వృద్ధితో దూసుకువెళుతోంది.
మరో పక్క యూపీఐ పేమెంట్స్ విభాగంగా ప్రముఖ పేమెంట్ యాప్ ఫోన్ పే అటు విలువ, ఇటు సంఖ్యాపరంగా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గూగుల్ పే, పేటీఎంలు నిలిచాయి. లావాదేవీలు మొత్తం విలువలో 81 శాతం ఇ - కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, గవర్నమెంట్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఉన్నాయి.