Nadendla Manohar: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ .. నేటి నుండి తక్కువ ధరకే వంట నూనెలు
- వ్యాపారస్తులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష
- శుక్రవారం నుంచి నెలాఖరు వరకూ రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకు వంట నూనెలు
- పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడి
ఏపీ సర్కార్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వంట నూనె ధరల తగ్గింపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ధరల పెరుగుదలపై సమీక్ష జరిపారు. వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆప్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
ఇండోనేసియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా .. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధరపై వంట నూనెలు విక్రయించాలని మంత్రి మనోహర్ వారికి సూచించారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.