Pawan Kalyan: డిప్యూటి సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ .. పిఠాపురం సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది నియామకం
- పిఠాపురం సీహెచ్సీలో ఎక్స్ రే యూనిట్ పునరుద్ధరణ
- ఎప్పటికప్పుడు అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష
- సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అధికారుల బృందాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఈ క్రమంలో పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి.)లో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్ రే యూనిట్ పని చేయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్, డి.ఎం.అండ్ హెచ్.ఓ.లతో చర్చించారు. తక్షణమే పిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులను, సిబ్బందిని నియమించాలని పవన్ ఆదేశించారు. నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి అయిన సి.హెచ్.సి.లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ లను పిఠాపురం సి.హెచ్.సి.లో నియమించారు. అదే విధంగా ముగ్గురు స్టాఫ్ నర్సులను, ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్ లను నిర్ణయించారు. అలానే ఎక్స్ రే యూనిట్ ను పునరుద్ధరించారు. దీంతో ఎక్స్రే యూనిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీహెచ్సీ మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.