Liquor Shop Tenders in AP: ఏపీలో కొత్త మద్యం పాలసీ.. ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు.. ఇప్పటికే ప్రభుత్వానికి భారీ ఆదాయం!
- ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు
- మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
- దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు
- గురువారం రాత్రి 8 గంటల వరకు వచ్చిన దరఖాస్తులు 65,629
- తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1,312.58 కోట్ల ఆదాయం
ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు. ఇక గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 7,920 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
కాగా, ఒక్కొ దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ రూపంలో రూ.2లక్షల దరఖాస్తు ఫీజు ఉంది. దీంతో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం వచ్చి చేరింది.
దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం తుది గడువు కావటంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 80, 81 దుకాణాలకు ఒక్కొ దరఖాస్తులే వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు అమరాపురంలోని 84వ దుకాణానికి కూడా ఒకటే టెండర్ వచ్చింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని 8, 9 నంబర్ల దుకాణాలకు కేవలం ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు.
అదేవిధంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏకంగా నాలుగు (175, 182, 183, 187) దుకాణాలకు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 26, 28 నంబరు దుకాణాలది ఇదే పరిస్థితి. అటు అనంతపురం జిల్లా పామిడిలోని 66, పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని 98వ నంబరు దుకాణాలకు ఒక్కొ దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు.