G. Kishan Reddy: రేవంత్ రెడ్డి మూసీ ప్రాంతంలో పర్యటించి కూల్చివేతలకు ఒప్పించాలి: కిషన్ రెడ్డి డిమాండ్
- కూల్చివేతలు అంత ఈజీ కాదన్న కిషన్ రెడ్డి
- మూసీ రిటర్నింగ్ వాల్‌ను నిర్మించి కూడా సుందరీకరణ చేయవచ్చని వెల్లడి
- రేస్ కోర్స్ అమ్మి మరీ సుందరీకరణ పనులు అవసరం లేదన్న కేంద్రమంత్రి
కూల్చివేతలు అంత ఈజీ కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూసీ ప్రాంతంలో పర్యటించి ప్రజలను ఒప్పించాలని కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేత సరికాదన్నారు. ఇక్కడి పేదలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ నివసించే ప్రజలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇళ్లను కొనుక్కున్నారని తెలిపారు. అలాంటి వాటిని కూల్చడమేమిటన్నారు.
మూసీ రిటర్నింగ్ వాల్‌ను నిర్మించి కూడా సుందరీకరణ చేయవచ్చన్నారు. అన్ని డ్రైనేజీలు మూసీలోనే కలుస్తాయని, కనీసం శుద్ధి జరగకుండా నేరుగా నదిలోనే మురుగునీరు కలుస్తోందన్నారు. తక్కువ ఖర్చుతోనే కేంద్ర ప్రభుత్వం గంగానదిని శుభ్రం చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు అవసరం లేదన్నారు. రేస్ కోర్స్ స్థలాన్ని అమ్మి మరీ సుందరీకరణ పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఎలాంటి ప్లాన్ లేకుండా హైడ్రా పేరుతో కూల్చివేతలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి దూకుడుగా వ్యవహరిస్తామంటే కుదరదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజలను బెదిరింపులకు, భయాందోళనకు గురి చేసిందన్నారు. హైడ్రాకు గవర్నర్ చట్టబద్ధత కల్పించడం సాధారణ ప్రక్రియ అన్నారు. హైడ్రా బాధితులు ఆందోళన చెందవద్దన్నారు. మూసీ బాధితుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
బస్ డిపో, మెట్రోను కూల్చాలని డిమాండ్
గతంలోనూ ప్రభుత్వాలు నిర్మాణాలను కూల్చివేశాయని, కానీ ఇప్పుడు పేరు మాత్రమే హైడ్రా అని మార్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. చెరువులను, నాలాలను కాపాడేందుకే అని చెప్పే హైడ్రా మొదట మూసీ నదిలో ఉన్న బస్సు డిపోను, మెట్రో పిల్లర్స్‌ను, మెట్రో స్టేషన్‌ను కూల్చాలని డిమాండ్ చేశారు. వాటిని కూల్చకుండా పేదల ఇళ్లు ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా తనను సంప్రదించడం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలపై స్పందించిన కిషన్ రెడ్డి
జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కిషన్ రెడ్డి స్పందించారు. ఆ రాష్ట్రంలోని 98 శాతం హిందువుల ఓట్లు తమకే వచ్చాయన్నారు. కశ్మీరీ పండిట్ల ఓట్లు బీజేపీకే పడ్డాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఓ చరిత్ర, దానిని తిరిగి తీసుకువచ్చే అవకాశమే లేదన్నారు. ఝార్ఖండ్ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కశ్మీర్లో పాక్ ఆటలు సాగవన్నారు.