BCCI: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వైస్ కెప్టెన్‌గా బుమ్రా ఎంపిక
- యశ్ దయాల్ మినహా మిగతావారంతా ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడినవారే
- ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా మయాంక్ యాదవ్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ
- శ్రేయాస్ అయ్యర్, అభిమన్యులకు దక్కని చోటు
- మోకాలి గాయం కారణంగా ఎంపిక కాని స్టార్ పేసర్ మహమ్మద్ షమీ
భారత్ వేదికగా అక్టోబర్ 16 నుంచి ఆరంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బీసీసీఐ శుక్రవారం పొద్దుపోయాక ప్రకటించింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో సాధించిన భారత్ జట్టులో కేవలం ఒక్క మార్పు చేసింది. యువ పేసర్ యశ్ దయాల్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు విముఖత వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లను ఎంపిక చేశారు.
ఇక మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి జట్టులో చోటుదక్కలేదు. ఆశ్చర్యకరంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లను ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా పేర్కొంది. ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలు ఈ జాబితాలో ఉన్నారు. బ్యాట్స్మెన్ల ఎంపిక విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్‌లను కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అందుకే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. నిజానికి ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు వైఎస్ కెప్టెన్‌గా ఎవరినీ నియమించలేదు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరంభ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది.
న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా షెడ్యూల్
తొలి టెస్టు - అక్టోబర్ 16-21, బెంగళూరు
2వ టెస్ట్ - అక్టోబర్ 24-28, పూణె
3వ టెస్ట్ - నవంబర్ 1-5, ముంబై