Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ అనూహ్య ట్వీట్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా ఊహించని పోస్ట్ పెట్టాడు. ‘‘వేలానికి వెళ్తే నేను అమ్ముడుపోతానా? లేదా? అమ్ముడుపోతే ఎంతకి పోవచ్చు??’’ అంటూ అభిమానులను ప్రశ్నించాడు. ఎక్స్ వేదికగా అతడు పెట్టిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా, స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఉండి ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటిని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాగా ఐపీఎల్ మెగా వేలానికి హైప్‌ను పెంచడానికి గతంలో కూడా పంత్ ఎక్స్ వేదికగా ఇదే తరహా పోస్ట్ పెట్టాడు. ఇదిలావుంచితే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రిషబ్ పంత్‌ను జట్టులో నిలుపుదల చేసుకోవాలని భావిస్తోంది. అతడిని వదిలిపెడుతున్నట్టుగా ఇప్పటివరకు ఒక్క సంకేతం కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప మరే ఇతర జట్టుకు పంత్ ఆడలేదు.
మరోవైపు ఐపీఎల్‌లో రిషబ్ పంత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇప్పటివరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 3,284 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడి స్ట్రైక్ రేటు 148.93గా ఉంది. ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు అతడు నమోదు చేశాడు. ఇక గత సీజన్‌లో రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇక గత ఐపీఎల్ సీజన్‌లో పంత్ అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్‌లలో 155.40 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 446 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే పంత్ రాణించినప్పటికీ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరవ స్థానానికే పరిమితమైంది.