Liquor Shops in AP: ఏపీలో మద్యం దుకాణాలకు రికార్డుస్థాయిలో దరఖాస్తులు.. ప్రభుత్వానికి భారీ ఆదాయం!
- దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారుల అంచనా
- తద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల వరకూ ఆదాయం
- వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు
- శుక్రవారం సాయంత్రం ఏడింటికి ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు
- ఈ నెల 16 నుంచి అమల్లోకి కొత్త మద్యం పాలసీ
ఏపీలో నూతన మద్యం పాలసీలో భాగంగా దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగిసింది. మొత్తం 3,396 దుకాణాలకు గాను దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఖజానాకు రూ.1800 కోట్లపైనే ఆదాయం సమకూరనుందని తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఏడింటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, ఆ సమయానికి 87,986 దరఖాస్తుల అందినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 11 గంటలకు ఆ సంఖ్య 89,643కు చేరింది. గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేలు దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇక ఆఖరి రోజునే 24,014 దరఖాస్తులు అందినట్లు సమాచారం. కాగా, వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు రావడం గమనార్హం.
సగటున ఒక్కో దుకాణానికి ఏలూరు జిల్లాలో 37, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 34, కర్నూలు, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 30 దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాల్లో మద్యం దుకాణాలకు ఎక్కువ పోటీ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు నోటికేషన్ ఇవ్వగా రాష్ట్రంలోనే అత్యధికంగా 5,787 దరఖాస్తులు వచ్చాయి. వత్సవాయి మండలంలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120 దరఖాస్తులు రావడం గమనార్హం.
పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు పడ్డాయి. ఈ మూడూ ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని దుకాణాలే కావడంతో భారీ మొత్తంలో దరఖాస్తుదారులు పోటీ పడ్డారు.
ఈ నెల 14న జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో వచ్చిన దరఖాస్తులను లాటరీ తీయనున్నారు. లాటరీ దక్కినవారికి 15న దుకాణాలు కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి నుంచి ఏపీ కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.