KCR: కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎంపీ
- ఉద్యమం ముసుగులో అందరినీ మోసం చేశారని ఆరోపణ
- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం
- తనను తెలంగాణ భవన్ నుంచి గెంటివేశారన్న రవీంద్రనాయక్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమం ముసుగులో ఆయన అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులను మోసం చేశారని విమర్శించారు. ఆయన బాధితులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు.
చాలామంది నాయకుల రాజకీయ భవిష్యత్తుతో కేసీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. పార్టీ కోసం, తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని బయటకు గెంటేశారని ఆరోపించారు. గిరిజనులు, మహిళలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక క్విడ్ప్రో పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్, నయీం, దేవాదాయ, వక్ఫ్, మిగులు భూములు కబ్జా చేయడమే కాకుండా వాటిని మాయం చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో వందల చెరువులు కనుమరుగయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ నాశనమవుతుందని హెచ్చరించారు. కవిత జైలు పాలవడానికి కారణం కేసీఆరేనని అన్నారు.
అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై రవీంద్రనాయక్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి ప్రజాపాలన చేస్తున్నారని కితాబునిచ్చారు. ఆయనకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలని సూచించారు.