Mallikarjun Kharge: బీజేపీ ఒక టెర్రరిస్టుల పార్టీ: ఖర్గే ఫైర్
- కాంగ్రెస్ అర్బన్ నక్సల్ ముఠాలకు మద్దతిస్తుంటుందన్న ఫడ్నవీస్
- మేధావులను అర్బన్ నక్సల్స్ అంటారా అంటూ ఖర్గే ఎదురుదాడి
- హర్యానాలో గెలుపుతో మళ్లీ రెచ్చిపోతున్నారంటూ బీజేపీపై ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఒక టెర్రరిస్టుల పార్టీ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు గిరిజనులపై దాడులు, అత్యాచారాలు, దళితులపై మూత్ర విసర్జన వంటి పనులకు పాల్పడుతుంటారని మండిపడ్డారు. అర్బన్ నక్సల్ ముఠాలకు కాంగ్రెస్ మద్దతిస్తుంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఖర్గే ఈ విధంగా స్పందించారు.
"ఇలాంటి ఘాతుకాలు బీజేపీకి అలవాటే. ఇన్నాళ్లు కాస్త బుద్ధిగా ఉన్నారు... కానీ, హర్యానాలో గెలిచేసరికి మళ్లీ రెచ్చిపోతున్నారు" అంటూ బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మేధావులను పట్టుకుని అర్బన్ నక్సల్స్ అంటున్నారు... ఇలాంటి ఆరోపణలు చేయడం వారికో అలవాటుగా మారింది అంటూ ఖర్గే మండిపడ్డారు.
ఇక, హర్యానాలో ఓటమిపైనా ఖర్గే స్పందించారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకుంటామని, ఎన్నికల్లో ఏం జరిగిందన్నది నివేదిక వచ్చాక తెలుస్తుందని అన్నారు.