Sanju Samson: ఉప్పల్ స్టేడియంలో సంజు శాంసన్ ఊచకోత... 40 బంతుల్లోనే సెంచరీ
- హైదరాబాద్ లో టీమిండియా × బంగ్లాదేశ్
- 3వ టీ20 లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- బంగ్లా బౌలర్లను ఉతికారేసిన సంజూ శాంసన్
- ఓ ఓవర్లో ఐదు సిక్సులు బాదిన శాంసన్
గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోని వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ఇవాళ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ కు వేదికైన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సంజూ శాంసన్ స్వైరవిహారం చేశాడు.
ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ గా బరిలో దిగిన శాంసన్ 40 బంతుల్లోనే 100 పరుగులు చేసి వావ్ అనిపించాడు. అంతకుముందు, రిషాద్ హుస్సేన్ విసిరిన ఓ ఓవర్లో శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాదడం విశేషం. శాంసన్ బాదుడుకు బంగ్లా బౌలర్లు విలవిల్లాడారు.
మరో ఎండ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెలరేగడంతో టీమిండియా స్కోరుబోర్డు వాయువేగంతో దూసుకెళ్లింది. చివరికి సంజు శాంసన్ ను ముస్తాఫిజూర్ రెహ్మాన్ అవుట్ చేయడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. సంజు శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 111 పరుగులు చేశాడు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 201 పరుగులు. సూర్య 71, రియాన్ పరాగ్ 1 పరుగుతో ఆడుతున్నారు.