Milk Packet: ప్యాకెట్ పాలను మరగబెట్టాకే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే?
- పచ్చి పాలను తాగొద్దని నిపుణుల సూచన
- ప్యాకెట్ పాలను ఆల్రెడీ వేడి చేస్తారని వివరణ
- నేరుగా తాగినా ఇబ్బంది ఉండదంటున్న డాక్టర్
పాలను వేడి చేశాకే తాగాలని పెద్దలు చెబుతుంటారు, అప్పుడే తీసుకొచ్చిన పాలను వేడి చేశాకే తల్లులు తమ పిల్లలకు తాగిస్తారు. దీని వెనక పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆవు లేదా గేదె నుంచి అప్పుడే పితికిన పాలలో బ్యాక్టీరియా ఉంటుందని, ఆ పాలను అలాగే తాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పచ్చి పాలను తాగొద్దని, పాలను మరిగించి చల్లారాకే తాగాలని సూచిస్తున్నారు. అప్పుడే పితికిన పాల విషయం సరే.. ఇప్పుడు అంతటా ప్యాకెట్ పాలే కదా మరి వీటిని కూడా వేడి చేశాకే తాగాలా అంటే ఆ అవసరం లేదని డాక్టర్ రాకేశ్ గుప్తా అంటున్నారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ రాకేశ్ గుప్తా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్యాకెట్ పాల విషయంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేశారు.
తెల్లవారుజామున ఇంటిముందుకు వచ్చే, ఇంటి పక్కనే ఉండే కిరాణా షాపులలో దొరికే పాల ప్యాకెట్ విషయంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నారు. ముందుగా పాడి రైతుల నుంచి సేకరించిన పాలను ఆయా కంపెనీలు వివిధ పద్ధతులలో ప్రాసెస్ చేసి ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తారని గుర్తుచేశారు. పాలను మాయిశ్చరైజ్ చేయడం కూడా ఈ ప్రాసెస్ లో ఓ భాగమని చెప్పారు. పాడి రైతుల నుంచి సేకరించిన పాలను కంపెనీలు వేడి చేసి చల్లార్చి, ఇతరత్రా ప్రాసెస్ పూర్తిచేశాకే ప్యాకెట్ ను తయారుచేస్తాయని వివరించారు. ప్యాకెట్ లోకి చేరకముందే పాలను వేడి చేస్తారు కాబట్టి మళ్లీ వేడి చేయాల్సిన అవసరంలేదని తెలిపారు. ప్యాకెట్ పాలను అవసరమైతే నేరుగా తాగొచ్చని డాక్టర్ రాకేశ్ గుప్తా వివరించారు.