Revanth Reddy: బండారు దత్తాత్రేయ 'అలయ్ బలయ్'లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్
- రాజకీయాలకు సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారని సీఎం ప్రశంస
- ఉద్యమంలో అలయ్ బలయ్ కీలకంగా పని చేసిందని వ్యాఖ్య
తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ కీలకంగా పని చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు వేదిక అలయ్ బలయ్ అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు.
తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమన్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడేలా బండారు దత్తాత్రేయ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధనకు అలయ్ బలయ్ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మన రాష్ట్రానికి దసరా అతిపెద్ద పండుగ అని ముఖ్యమంత్రి అన్నారు. దసరా అంటేనే పాలపిట్ట, జమ్మిచెట్టు గుర్తుకు వస్తుందన్నారు. అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారని ప్రశంసించారు.
బండారు దత్తాత్రేయ నుంచి వారసత్వంగా విజయలక్ష్మి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, మున్ముందు కూడా ఆమె దీనిని దిగ్విజయంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించారు. అలయ్ బలయ్‌కు బండారు విజయలక్ష్మి చైర్మన్‌గా ఉన్నారు. ఆమె అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ సన్మానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ నేత లక్ష్మణ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మేఘాలయ గవర్నర్లు పాల్గొన్నారు.