US: ఇరాన్ హెచ్చరికలు... అయినప్పటికీ ఇజ్రాయెల్ కు అమెరికా ఆయుధసాయం
- అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను ఆపరేట్ చేసేందుకు బలగాలను ఇజ్రాయెల్ కు పంపుతున్నట్లు ప్రకటించిన అమెరికా
- జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వ్యవస్థను మోహరించేందుకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని వెల్లడి
- క్షిపణి నిరోధక వ్యవస్థను ఇజ్రాయెల్ కు అందించి వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తోందని ఇరాన్ ఆగ్రహం
అమెరికా తన సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్ నుంచి దూరంగా ఉంచాలని ఇరాన్ హెచ్చరించిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ లో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను మోహరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఓ పక్క ఇటీవలి ఇరాన్ క్షిపణి దాడులపై ఇజ్రాయెల్ ప్రతి దాడులకు సిద్ధమవుతుందనే వార్తలు పశ్చిమాసియాలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను ఆపరేట్ చేసేందుకు బలగాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు అమెరికా పేర్కొనడం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పించింది.
టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (టీహెచ్ఏఏడీ)ని, సైనిక దళాలను ఇజ్రాయెల్ కు పంపుతున్నట్లు పెంటగాన్ ఆదివారం ప్రకటించింది. టీహెచ్ఏఏడీ అనేది ఓ గగనతల రక్షణ వ్యవస్థ. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఇది కూల్చేస్తుంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వ్యవస్థను మోహరించేందుకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు ఇది సాయపడుతుందని తెలిపింది.
అంతకు ముందే అమెరికాపై ఇరాన్ ఆరోపణలు చేసింది. ఇజ్రాయెల్‌కు అమెరికా రికార్డు స్థాయిలో ఆయుధాలను అందిస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఇప్పుడు క్షిపణి నిరోధక వ్యవస్థను మోహరించి, దాన్ని నిర్వహించేందుకు బలగాలను పంపుతోందని, వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, తమ ప్రజలను, ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో హద్దులన్నీ చెరిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయాద్ అబ్బాస్ ఆరాఘ్చీ హెచ్చరించారు.