Konda Surekha: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు... 18న ఆ నలుగురి వాంగ్మూలం నమోదు
- కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
- పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు
- బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి, తుల ఉమ వాంగ్మూలాలను నమోదు చేయనున్న కోర్టు
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ఈ నెల 18న నాంపల్లి కోర్టు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. కేటీఆర్ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని తెలిపింది.
పిటిషనర్ కేటీఆర్‌తో పాటు సాక్షులుగా ఉన్న బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, తుల ఉమ వాంగ్మూలాలను నమోదు చేస్తామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.
తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా కొండా సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు గాను వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని అంతకుముందు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఇచ్చిన గడువు ముగియడంతో మంత్రిపై పరువు నష్టం దావా వేశారు.